ముగ్గురు మహిళల్ని మింగిన బహిర్‘భూమి’
X
కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయలుకు వెళ్లిన ముగ్గురు మహిళలు సజీవసమాధి య్యారు. ఏం జరుగుతోందో తెలిసే లోపే మట్టిపెళ్లల కింద కూరుకుపోయారు .జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. గోండుడిహ్ కాలరీలోని దోబి కులీ ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలు పర్లా దేవి, తంధీ దేవి, మండవ దేవిలు తమ ఇళ్లలో టాయిలెట్లు లేకపోవడంతో బహిర్భూమికి వెళ్లారు.
కుసుంద కాలరీలోని కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ భారత్ కాకింగ్ కోల్ లిమిటెడ్ నిర్వహిస్తున్న గనుల దగ్గరికి వెళ్లారు. అదే సమయంలో పక్కనే ఉన్న కొండపై నుంచి పెద్ద శబ్దంతో కొండచరియలు విరిగిపడ్డాయి. మహిళలు వాటిని తప్పించుకోవానికి ప్రయత్నించారు. ఒక మహిళ మట్టిచరియల్లో కూరుకుపోగా మిగతా ఇద్దరు ఆ మహిళను ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే వారు కూడా మట్టిపెళ్లల కింద కూరుకుపోయారు. స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు చాలా ఆసల్యంగా వచ్చారని స్థానికులు విమర్శిస్తున్నారు. బీసీసీఎల్ బొగ్గును తవ్వుకున్న తర్వాత కనీస భద్రతా చర్యలు కూడా తీసుకోవం లేదని ఆరోపించారు. తమకు నష్టపరిహారం ప్రకటించి, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా చూడాలని మృతుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.