బోరుబావిలో పడ్డ మూడేండ్ల చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
X
బీహార్ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలు చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు శ్రమిస్తున్నాయి.
శివం కుమార్ అనే మూడేళ్ల చిన్నారిని తల్లి తన వెంట పొలానికి తీసుకెళ్లింది. బాలుడి తల్లి పొలంలో పనిచేస్తుండగా.. ఆ చిన్నారి ఆడుకుంటూ కారుజారి బోరుబావిలో పడిపోయాడు. అది గమనించిన తల్లి కుటుంబసభ్యులతో పాటు స్థానికులకు సమాచారం ఇచ్చింది. పోలీసులకు విషయం తెలియడంతో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బాలుడు 40 అడుగుల లోతులో ఇరుక్కున్నట్లు అధికారులు గుర్తించారు. చిన్నారి బతికే ఉన్నాడని, అతని అరుపులు వినిపిస్తున్నాయని చెప్పారు. దీంతో బోరుబావిలోకి పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూ బాలుడిని సురక్షితంగా వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పొలంలో బోరు వేసిన రైతు అందులో నీరు పడకపోవడంతో దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేశాడు. ఎలాంటి రక్షణ లేకపోవడంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయినట్లు తెలుస్తోంది. చిన్నారిని బయటకు తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. బాలుడిని బయటకు తీసిన వెంటనే అత్యవసర చికిత్స అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారు.
జూన్ 6న మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే బోరు బావిలో పడ్డ చిన్నారిని బయటకు తీసేలోపే మరణించింది.