ప్రొద్దుటూరులో రూ. 160 కోట్ల బంగారం స్వాధీనం
X
తంబ.. రెండో ముంబైలో దొంగబంగారం కలకలం
రెండో ముంబైగా పేరొందిన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో దొంగ బంగారం భారీ స్థాయిలో పట్టుబడింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో 300 కేజీలకుపైగా బంగారం దొరికింది. దేశ విదేశాల నుంచి సరైన బిల్లులు లేకుండా దిగుమతి చేసుకున్న పసిడిని పబ్లిగ్గా అమ్ముతున్నారని ఉప్పందడంతో అధికారులు దాడులు చేశారు. దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్న బుశెట్టి జువెలర్స్, డైమండ్స్, గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు సోదాలు చేశారు. గత నాలుగు రోజులుగా జరిగిన సోదాల వివరాలను వెల్లడించారు. అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకున్న ఈ బంగారాన్ని అధికారులు పటిష్ట భద్రత మధ్య తిరుపతికి తీసుకెళ్లారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారులను విచారించి నోటీసులు జారీ చేశారు. కొంతమంది వ్యాపారులను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఐటీ దాడులతో భయపడిన వ్యాపారులు తమపై దాడి చేస్తారని భయంతో షాపులను మూసేశారు. దసరా సీజన్లో వ్యూహాత్మకంగా ఐటీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ప్రొద్దుటూరులో దొంగ బంగారం భారీ స్థాయిలో వెలుగు చూసింది. తమిళనాడు, ముంబైలతోపాటు గల్ఫ్ నుంచి కూడా బంగారాన్ని అడ్డదారిలో తీసుకొస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ప్రొద్దుటూరులో బంగారం ధరలు కాస్త తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు భారీగా సాగుతుంటాయి. పట్టణంలో రెండువేలకుపై బంగారం షాపులు ఉన్నాయి.