Uttarakhan : కుప్పకూలిన సొరంగం.. శిథిలాల కింద 36 మంది కూలీలు
X
ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ టన్నెల్ కింద కనీసం 36 మంది చిక్కుకున్నట్టు సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న SDRF బృందం సహాయక చర్యలు మొదలు పెట్టింది. ఉత్తరకాశీలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. పోలీస్ రెవెన్యూ టీమ్స్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఉత్తరకాశి జిల్లా సిల్కయారా-దండల్‌గావ్‌లను కలిపేలా చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ సొరంగ మార్గం నిర్మాణం జరుగుతోంది. ఈ సొరంగం మార్గం అందుబాటులోకి వస్తే యమునోత్రి ధామ్‌కి ఏకంగా 26 కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో 150 మీటర్లు కూలిపోయినట్టు చెప్పారు.
జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ రహదారుల విభాగం సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షించారు 'సిల్క్‌యారా టన్నెల్లో ప్రారంభంలో 200 మీటర్ల మేర మార్గం దెబ్బతింది. ఈ సొరంగ నిర్మాణాన్ని పనులను హెచ్‌ఐడీసీఎల్ చూసుకుంటోంది. సొరంగం లోపల 36 మంది వరకు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వీలైనంత త్వరగా క్షతగాత్రులను బయటకు తీసుకువస్తాము' అని ఉత్తరకాశీ ఎస్పీ అర్పణ్ యదువంశీ చెప్పారు.