Nipah virus : కేరళలో 6కు చేరిన నిఫా కేసులు.. కొనసాగుతున్న ఆంక్షలు
X
కేరళలో నిఫా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల వ్యక్తికి నిఫా పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో కాంటాక్ట్ లిస్ట్ కూడా క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 950 వైరస్ సోకిన వారితో కాంటాక్ట్ లో ఉన్నట్లు తేలింది. వారిలో 213 మంది హై రిస్క్ లిస్టులో ఉన్నారు. ప్రైమరీ కాంటాక్ట్ లిస్టులో 287 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో అది మరింత వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు అమలుచేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సోషల్ డిస్టెన్సింగ్తో పాటు మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించింది.
ఇదిలా ఉంటే కోవిడ్ 19 కన్నా నిఫా వైరస్ మరింత ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భల్ స్పష్టం చేశారు. కరోనా కన్నా నిఫా సోకిన వారిలో మరణాల రేటు ఎక్కువని చెప్పారు. కోవిడ్ సోకిన వారిలో మరణాల రేటు 2 నుంచి 3శాతం ఉంటే.. నిఫా సోకిన వారిలో అది 40 నుంచి 70 శాతం ఉంటుందని చెప్పారు. 2018 నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు నిఫా వైరస్ విజృంభించిందని రాజీవ్ అన్నారు. గబ్బిలాల నుంచి మనుషులకు వైరస్ ఎలా సంక్రమించిందన్నది అంతుచిక్కడం లేదని చెప్పారు.