Home > జాతీయం > గుండెపోటుతో 'మిస్టర్ తమిళనాడు' మృతి

గుండెపోటుతో 'మిస్టర్ తమిళనాడు' మృతి

గుండెపోటుతో మిస్టర్ తమిళనాడు మృతి
X

దేశ యువతను గుండె జబ్బులు పొట్టన పెట్టుకుంటున్నాయి. చిన్న వయస్సులోనే ప్రాణాలు తీసుకుంటున్నాయి. వ్యాయమం, జిమ్​ చేస్తూ చాలా మంది యువకులు అక్కడిక్కడే కుప్పకూలుతున్నారు. కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం.. కోవిడ్ కారణంగా ఇటువంటి సంఘటనలు జరగడం లేదని అంటున్నారు. కానీ ఇలా గుండెపోట్లతో చనిపోతున్న వారిలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాట్‌కు దూరంగా ఉండే వారే ఉండడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. 'మిస్టర్ తమిళనాడు' టైటిల్​ విన్నర్​, ప్రముఖ బాడీ బిల్డర్​ యోగేశ్​ గుండెపోటుతో మరణించారు.





చెన్నై అంబత్తూర్​ మేనంపేడులోని మహాత్మా గాంధీ వీధికి చెందిన యోగేశ్​.. అనేక బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. 2021లోనే 9 బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్​ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్​.. కొరటూర్ బస్​స్టేషన్​ సమీపంలోని జిమ్​లో ట్రైనర్​గా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలోనే జిమ్​కు వెళ్లిన ఆయన ట్రైనింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్​.. బాత్​రూమ్​కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఎంతసేపయినా బాత్​రూమ్​ లోపలికి వెళ్లిన యోగేశ్​.. రాకపోవడం వల్ల యువకులకు అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు పగలగొట్టి వెళ్లి చూడగా.. యోగేశ్​ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన యువకులు.. యోగేశ్‌ను స్థానిక కిల్పౌక్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో యోగేశ్​ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్​కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్​.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. యోగేశ్ పనిచేస్తున్న జిమ్​కు వెళ్లి విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.







Updated : 10 Oct 2023 8:14 AM IST
Tags:    
Next Story
Share it
Top