Home > జాతీయం > చుట్టూ వరద నీరు.. స్టేషన్లో చిక్కుకున్న 500 మంది ప్యాసింజర్లు

చుట్టూ వరద నీరు.. స్టేషన్లో చిక్కుకున్న 500 మంది ప్యాసింజర్లు

చుట్టూ వరద నీరు.. స్టేషన్లో చిక్కుకున్న 500 మంది ప్యాసింజర్లు
X

తమిళనాడుపై వరుణుడి ప్రకోపం కొనసాగుతోంది. భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఇదే క్రమంలోనే ట్యూటికోరిన్ జిల్లాలోనూ కుండపోత వర్షాలకు 500 మంది ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకుపోయారు.

భారీగా కురుస్తున్న వర్షాలకు ట్యూటికోరిన్ జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ నీట మునిగింది. స్టేషన్ చుట్టూ భారీగా వరద నీరు చేరింది. నీటి ఉద్ధృతికి పట్టాల కింద ఉన్న మట్టి, కంకర కొట్టుకుపోయింది. దీంతో తిరుచండూర్ నుంచి చెన్నై వెళ్తున్న రైలు శ్రీవైకుంఠం స్టేషన్లోనే నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. అయితే స్టేషన్కు వెళ్లే రోడ్డు వరద నీటి ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో అక్కడికి చేరడం కష్టంగా మారింది.

స్టేషన్లో చిక్కుకుపోయిన ప్యాసింజర్లంతా సురక్షితంగా ఉన్నారని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరే ప్రయత్నం చేస్తున్నాయని, అప్పటి వరకు హెలికాప్టర్ల ద్వారా ప్రయాణికులకు అవసరమైన ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వీలైనంత తొందరగా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.

తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గినా చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. కన్యాకుమారి, తూత్తుకుడి, తెన్ కాశీ, తిరునల్వేలి జిల్లాలు వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరద పరిస్థితిపై చర్చించేందుకు తమిళనాడు సీఎం డిసెంబర్ 19న ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ కోరారు.


Updated : 18 Dec 2023 5:19 PM IST
Tags:    
Next Story
Share it
Top