యూపీ, బీహార్లో భానుడి భగభగ.. వడగాల్పులకు 98 మంది బలి..
X
ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాడ్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడి, వడగాల్పుల కారణంగా ఉత్తర ప్రదేశ్‌లో 54 మంది, బిహార్‌లో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, డయాబెటిస్, బీపీ తదితర ఆరోగ్య సమస్యలు ఉన్న వందల మంది పేషెంట్లు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయినట్లు అధికారులు చెప్పారు. పేషెంట్లలో చాలా మంది 60 సంవత్సరాల వయసు పైబడినవారు ఉన్నారని అన్నారు.
యూపీలో 54 మరణాలు
ఉత్తర ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో జూన్ 15, 16, 17 తేదీల్లో 54 మంది జిల్లా ఆసుపత్రిలో చేరారు. జిల్లాలో వడగాడ్పులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనాల ఆరోగ్య సమస్యలు మంరిత పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్, అతిసారం వల్ల చాలా మంది చనిపోతున్నారని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం జూన్ 15న 23 మంది, 16న 20 మంది, 17న 11 మంది మరణించారు. ఉక్కపోత నుంచి రోగులకు ఉపశమనం కోసం ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పెంచినట్లు అధికారులు చెప్పారు.
బీహార్‌లో 44 మంది మృతి
బీహార్‌లో ఎండ తీవ్రతకు 24 గంటల వ్యవధిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 35 మంది పాట్నాకు చెందినవారేకావడం గమనార్హం. శనివారం బీహార్ లోని 11 జిల్లాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పాట్నాలో టెంపరేచర్ 44.7 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. షేక్‌పురాలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ, వడగాల్పుల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 24 వరకు పొడగించారు.
మరో రెండ్రోజులు ఎండలు
ఇదిలా ఉంటే బీహార్లో మరో రెండు రోజులు పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ 18, 19 తేదీల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. ఔరంగాబాద్, రోహ్‌తాస్, భోజ్‌పుర్, బక్సర్, కైమూర్, ఆర్వాల్, పాట్నా, బేగుసరాయ్, ఖగారియా, నలంద, బంక, షేక్‌పుర, జముయి, లఖిసరాయ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. తూర్పు చంపారన్, గయ, భాగల్‌పూర్, జెహానాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.