టమాటా రైతుకు కాసుల వర్షం..ఒక్కరోజులోనే రూ.38 లక్షల ఆదాయం
X
దేశవ్యాప్తంగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు సామాన్యుడికి పట్టపగలే చుక్కలను చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత వారం పది రోజులుగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదిలా ఉంటే టమాటా సాగు చేసిన రైతులు మాత్రం పెరిగిన ధరలను చూసి పండుగ చేసుకుంటున్నారు. వారి శ్రమకు మించి ఫలితం అందుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే క్రమంలో టమాట ధర పెరుగుదలతో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ రైతు టమాటాలను అమ్మి ఒకే ఒక్క రోజులో లక్షాధికారిగా మారాడు. దాదాపు ఒక్కరోజే రూ. 38 లక్షల ఆదాయాన్ని టమాటాల ద్వారా ఆర్జించాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
కర్ణాటకలోని ఓ రైతు కుటుంబం టమాటాల అమ్మకం ద్వారా ఒకే రోజు రూ.38 లక్షల ఆదాయాన్ని పొందారు. కోలార్ జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం 2 వేల బాక్స్‌ల టామాటాలను మార్కెట్‌లో విక్రయించగా ఈ ఆదాయం వచ్చింది. ఒక్కో బాక్స్‌ను రూ.1,900 చొప్పున అమ్మగా అక్షరాలా రూ.38 లక్షలు వచ్చాయట.
దీంతో వారి పంట పండినట్లైంది. గతంలో టమాటాల సాగు ద్వారా గిట్టుబాటు ధర కూడా వచ్చేది కాదు. కానీ నేడు ఊహించని విధంగా లక్షల ఆదాయం రావడంతో ఈ రైతు కుటుంబ సభ్యులు నేడు లక్షాధికారులు అయ్యారు.
కోలార్ జిల్లాలోని బేథమంగళలో ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడికి 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో ఏటా టమాటాలను సాగు చేస్తున్నారు. ఈ ఏడు అదే విధంగా పండించగా మార్కెట్ లో ఊహించని విధంగా ధర పలకడంతో వారి ఆర్థిక స్థితి ఒక్కసారిగా మారిపోయింది. రికార్డు స్థాయిలో తాజాగా 15 కేజీల బాక్స్ రూ.1,900 పలికింది.
టమాటా దరల పెరుగుదల నేపథ్యంలో బుధవారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన వినియోగ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకుగానూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించాలని, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 14 నుంచి ఢిల్లీతో పాటు బీహార్, యూపీ, పశ్చిమబెంగాల్‌లోని పలు నగరాల్లో టమాటాలను రాయితీ ధరకు పంపిణీ చేస్తామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది.