Home > జాతీయం > భర్త అంటే ఇలా ఉండాలి.. భార్యకు గుడి కట్టి..

భర్త అంటే ఇలా ఉండాలి.. భార్యకు గుడి కట్టి..

భర్త అంటే ఇలా ఉండాలి.. భార్యకు గుడి కట్టి..
X

కార్యేషు దాసి.. కరణేశు మంత్రి.. భోజ్యేశు మాత.. అంటూ భార్య అలాగే ఉండాలని.. భర్తకు మాత్రం ఎలాంటి కట్టుబాట్లు అవసరం లేదంటుంటారు కొంతమంది. అప్పటి వరకూ అన్ని విధాల సేవలు చేసిన భార్య.. ఏదైనా కారణంతో చనిపోగానే రోజుల వ్యవధిలో మరో పెళ్లికి సిద్ధమవుతుంటారు ఇంకొందరు. అలాంటి మగాళ్లంతా... రామ్ సేవక్ అనే వ్యక్తిని చూసి నేర్చుకోవాలి. ప్రాణానికి ప్రాణమైన తన భార్య తన నుంచి దూరం కావడం జీర్ణించుకోలేకపోయాడు. నిత్యం ఆమె ఆలోచనలతోనే గడుపుతూ.. ఏకంగా ఆమెకి గుడి కట్టి పూజలు చేస్తున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ఫతేపుర్ జిల్లాలోని బకేవర్ పరిధిలోని పధారా గ్రామంలో రామ్ సేవక్-స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఎంతో ప్రేమగా కలిసుండేవారు. అయితే కరోనా సమయంలో స్వరూప వైరస్ మహమ్మారి బారిన పడి మే 18, 2020 న మరణించింది. భార్య మరణాన్ని భర్త రామ్ సేవక్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమె మరణంతో చాలా కలత చెందాడు. కొంత కాలం తర్వాత భార్యపై ఉన్న ప్రేమతో ఓ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ నిర్మాణానికి తన పొలం భూమిని ఎంచుకున్నాడు. రెండంతస్తుల్లో ఆలయాన్ని నిర్మించాడు, అందులో తన భార్య విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఆమెకు రోజూ నిత్య పూజలు చేస్తూ తన ప్రేమను చాటుకుంటున్నాడు.

రామసేవక్ రైదాస్ దంపతులకు 5 మంది పిల్లలు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ప్రస్తుతం ఉద్యోగం నుంచి రిటైరైన రామ్ సేవక్... తన పొలంలోని భార్య గుడి వద్దే ఎక్కువ సేపు గడుపుతున్నారు. మొదట్లో, రామసేవక్ భార్య కోసం ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు గ్రామస్థులు అతని నిర్ణయాన్ని స్వాగతించలేదు. కొందరు ఎగతాళి చేశారు కూడా.. అయితే గుడి కట్టిన తర్వాత భార్యపై అతడి ప్రేమ ఎంత నిజమో అందరికీ అర్థమైంది. ఈ అంశంపై భర్త రామ్ సేవక్ స్పందిస్తూ.. ఈ గుడిలో ఉంటే నాకు నా భార్యతో ఉన్నట్లే అనిపిస్తుంటుందని, అందుకే రోజూ సాయంత్రం పూట పూజలు చేస్తానని తెలిపారు.





Updated : 8 Aug 2023 7:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top