సమాధులను తవ్వి..శవాలపై నీళ్లు చల్లుతున్నారు..ఎందుకంటే..
X
వర్షాలు సమయానికి సమృద్ధిగా కురవాలని ఒక్కోచోట ఒక్కొక్కరు ఒక్కో ఆచారాన్ని పాటిస్తుంటారు. కొంత మంది కప్పల పెళ్లిళ్లు చేస్తే వర్షాలు కురుస్తాయని భావిస్తే మరి కొంత మంది గ్రామ దేవతలకు పూజలు చేస్తుంటారు. కానీ కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు పాటించే ఆచారాన్ని చూస్తే మాత్రం అందరికి ఒకింత భయం పుట్టుకువస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్షాల కోసం వింత ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. ఏకంగా సమాధులను తవ్వి శవాలను శాంతింపజేసేందుకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ పద్ధతిని అనుసరిస్తే పది రోజుల్లోనే వర్షాలు కురుస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని విజయపుర జిల్లాలోని కలకేరి గ్రామ ప్రజలు ఈ వింత ఆచారాన్ని ఏళ్లుగా అనుసరిస్తున్నారు. ఆచారంలో భాగంగా ప్రజలు ఓ నీళ్ల ట్యాంకర్ తీసుకుని ఊర్లో ఉన్న స్మశానానికి వెళ్తారు. అక్కడ గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేసి సమాధులు తవ్వుతారు. మృతదేహాలపైకి ట్యాంకర్లతో నీళ్లు పంపింగ్ చేస్తారు.అనంతరం ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థిస్తారు. వానాకాలం ప్రారంభమైనా ఇంకా గ్రామంలో వానలు కురవకపోవడంతో గ్రామస్థులు ఈ పూజలు మొదలుపెట్టారు. గత ఏడాది కూడా ఇదే విధంగా వర్షాలు కురవకపోతే ఈ తరహాలోనే పూజలు చేశామని గ్రామస్థులు వివరించారు. ఆ తరువాత 10 రోజుల్లోనే వానలు కురిశాయని తెలిపారు. ఇప్పుడు కూడా అదే విధంగా వర్షాలు కురుస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.