Aam Aadmi Party: 3 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పోటీ.. స్పష్టం చేసిన కేజ్రీవాల్
X
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బరిలోకి దిగుతుందని ప్రకటించారు. ఆ మూడు రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అయితే ఒంటరిగా బరిలోకి దిగుతారా? లేదా ‘ఇండియా’ కూటమిలో భాగంగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నలకు ఏం జరిగినా వెంటనే మీకు తెలియజేస్తామని సమాధానమిచ్చారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్ లో బీజేపీ పాలన కొనసాగుతోంది. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో ఆప్ బరిలోకి దిగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీచేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ కేడర్ బలంగా ఉంది. ఈ క్రమంలో ఆప్తో పొత్తుకు స్థానిక నేతలు మొగ్గుచూపుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.