Home > జాతీయం > Shamirpet Tahsildar: ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. రూ.40 లక్షల లంచం డిమాండ్

Shamirpet Tahsildar: ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. రూ.40 లక్షల లంచం డిమాండ్

Shamirpet Tahsildar: ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. రూ.40 లక్షల లంచం డిమాండ్
X

వారం రోజులుగా టీవీల్లో, పేపర్లలో HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలక్రిష్ణ అక్రమాస్తులకి సంబంధించిన వార్తలు వరుసగా వస్తున్నాయి. బాలక్రిష్ణ అక్రమంగా సంపాదించిన రూ. వందల కోట్ల సొమ్ము చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నిజాలు తెలిసి నివ్వెరపోతున్నారు. ఓవైపు ఇంత జరుగుతుంటే.. ఇదంతా మాములే అన్నట్టుగా మరో అవినీతి ఆఫీసర్‌ తన అక్రమార్జనకు తెరలేపాడు. పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తాసీల్దార్‌ తోడేటి సత్యనారాయణ మంగళవారం ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ గచ్చిబౌలికి చెందిన మువ్వ రామశేషగిరిరావుకు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గడిమలక్‌పేట పంచాయతీ సమీపంలో 29 ఎకరాల భూమి ఉంది. ఈ భూములకి సంబంధించి కొత్త పాస్‌బుక్‌, రికార్డుల నిర్వహణ కోసం ధరణిలో ఆర్జి పెట్టుకున్న శేషగిరిరావు తాసీల్దార్‌ సత్యనారాయణను ఆశ్రయించారు. రూ.40లక్షలు ఇస్తే... ధరణిలో నమోదుతోపాటు పట్టాదారు పాసుపుస్తకం వచ్చేలా చేస్తామన్నాడు. చివరకు రూ.30 లక్షలకు ఇద్దరి మధ్య బేరం కుదిరింది. ఇందులో భాగంగానే గతేడాది అడ్వాన్స్‌గా రూ.10లక్షలు తీసుకొని, మరో రూ.20 లక్షలకు గ్యారంటీగా పేరు లేకుండా రాసిన చెక్కును గత డిసెంబరు 28న తీసుకున్నాడు.

ఇంకో రూ.10 లక్షలు ఇస్తేనే ధరణిలో నమోదుచేసి పాస్‌పుస్తకాలు అందిస్తానన్నాడు. అప్పటి నుంచి కార్యాలయానికి వస్తున్నా పని జరుగకపోవడంతో రైతు శేషగిరిరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. తహసీల్దార్‌ తనకు వరుసకు బావమరిది అయ్యే పి.బద్రిని డ్రైవరుగా పెట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌, డ్రైవరుపై నిఘా ఉంచారు. ప్రస్తుతం రూ.10 లక్షలు ఇస్తానంటూ నగదుతో బాధితుడు మంగళవారం శామీర్‌పేట తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు. తన డ్రైవరుకు ఇవ్వాలని సత్యనారాయణ సూచించాడు. కారులో ఉన్న డ్రైవరుకు ఇస్తుండగా అనిశా అధికారులు బద్రిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. అవినీతి అధికారిపై గతంలోనే పలు ఫిర్యాదులు రావడంతో ఆయన్ను పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ, ఈసారి పక్కాగా స్కెచ్ వేసి పట్టుకున్నారు.



Updated : 14 Feb 2024 9:46 AM IST
Tags:    
Next Story
Share it
Top