Siva Balakrishna Benami : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు
X
(Siva Balakrishna Benami) హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నేడు నాలుగో రోజు ఆయన్ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆయన బినామీలు, బ్యాంకు లాకర్ల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. రెరా కార్యదర్శిగా ఉన్నప్పుడు బాలకృష్ణకు సహకరించిన వారిపై ఏసీబీ అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం దానిపై పలు ప్రశ్నలు సంధిస్తూ విచారిస్తున్నారు. దాడుల్లో బయటపడ్డ ఆస్తులు తనకు ఎలా సమకూరాయని విషయంపై ఏసీబీ అధికారులు వివరాలు రాబడుతున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించింది. అదేవిధంగా 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతులు ఇచ్చింది. అందులో ఇప్పటికే మూడు రోజుల పాటు శివబాలకృష్ణను అధికారులు విచారించారు. బాలకృష్ణకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించడమే కాకుండా వందలాది డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బాలకృష్ణకు సంబంధించిన మూడు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరవగా అందులో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన భూములే కాకుండా వాటి పక్కనే బినామీల పేర్లతో భూములను బాలకృష్ణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. బినామీల పేర్లతో పలు భూమి పాసుపుస్తకాలు దొరికాయి. దీంతో బినామీలకు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. త్వరలో వారిని కూడా విచారించే అవకాశం ఉంది.