Home > జాతీయం > Caste Census: కుల గణన: బిహార్ బాటలో మరికొన్ని రాష్ట్రాలు.. కాంగ్రెస్ రెడీ

Caste Census: కుల గణన: బిహార్ బాటలో మరికొన్ని రాష్ట్రాలు.. కాంగ్రెస్ రెడీ

Caste Census: కుల గణన: బిహార్ బాటలో మరికొన్ని రాష్ట్రాలు.. కాంగ్రెస్ రెడీ
X

బిహార్​ రాష్ట్ర కుల గణనకు సంబంధించిన డేటా విడుదలైంది. కులాల వారీగా జనాభా లెక్కల సేకరణకు తమ రాష్ట్రంలోని 9 పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపడంతో కుల గణన ప్రారంభించామని చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ . ఈ గణన వల్ల ఏ కులం వారు ఎందరు ఉన్నారనేది తెలియడంతోపాటు వారి ఆర్థికస్థితి గతులు తెలిశాయని, త్వరలోనే 9 పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కూడా సమాచారం అందిస్తామన్నారు. ఇక ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

ఇప్పటి వరకూ భారతదేశంలో రిజర్వేషన్ల అమలుకు కులమే ప్రాతిపదిక. ఎస్సీ, ఎస్టీల విషయంలో పూర్తిగా కులం ప్రాతిపదిక కాగా, బీసీల విషయంలో క్రీమీలేయర్ పెట్టడం ద్వారా కులంతో పాటూ ఆర్థిక స్థితిని కూడా ఓ ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే బిహార్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కుల గణన సేకరణ.. కేంద్రం లోని బీజేపీకి మాత్రం కష్టమైంది. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల లెక్క తేల్చకుండా.. ఇప్పటివరకూ మీనమేషాలు లెక్కించింది. బీసీ కులగణన చేయమని ఏడు దశాబ్దాల నుంచి ఓబీసీలు అభ్యర్థిస్తూనే ఉన్నారు. కానీ ఓబీసీలను ఓటుబ్యాంకులుగా చూసిందే తప్ప వారిని పట్టించుకోలేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కులగణన వల్ల వివిధ రంగాల్లో.. బీసీల సంఖ్యకు తగిన ప్రాతినిధ్యం లభించడనేది ఓ వర్గం టాక్(తాజా సంఖ్యలతో అదే నిజమైంది కూడా). ఈ గుర్తింపు వల్ల సామాజిక న్యాయం కోసం ఈ వర్గాలలో ఒక కొత్త రాజకీయ చైతన్యం మొదలై, సామాజిక ఉద్యమానికి నాంది పలికే అవకాశం ఉంది. ఈ పరిస్థితే వస్తే బీజేపీ రాజకీయాలు ప్రభావం కోల్పోతాయి. కాబట్టే, బీసీ జనగణన జరుపటానికి బీజేపీ నిరాకరించిందని టాక్ నడుస్తోంది.

నరేంద్ర మోదీ తొలి హయాంలో రాజ్‌నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉన్నప్పుడు, 2021 జనాభా లెక్కల సేకరణకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో కొత్తగా చేపట్టే జనాభా లెక్కల్లో ఓబీసీల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మీడియా ముఖంగా చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం.. గతంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో కులగణన చేసినట్లయితే దేశంలో జాతి వైషమ్యాలుపెచ్చరిల్లుతాయని, కులాల మధ్యన కొట్లాటలు జరుగుతాయని చెప్పింది. తాము చేపట్టే కుల గణనలో ఎస్​సీ, ఎస్​టీలను మాత్రమే లెక్కిస్తామని తేల్చి చెప్పడంతో.. ఇక కేంద్రంతో లాభం లేదనుకుని నితీశ్​ కుమార్​ ప్రభుత్వం సొంతంగా జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో రాష్ట్రాలు కులగణన చేసినట్లయితే కొట్లాటలు జరుగుతాయనే అంశాన్ని కన్వీనియెంట్‌గా విస్మరించింది. నిజానికి ఎలాంటి వైషమ్యాలు లేకుండా అటు బీహార్‌ రాష్ట్రం, అంతకు ముందు తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాలు ఈ లెక్కలను సేకరించాయి. అయితే ఇప్పుడు కుల గణన చేసిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలవడంతో.. దేశంలోని 143 కోట్ల మంది పౌరుల కులగణన చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

తాజా బిహార్ లెక్కలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. “బీహార్ కుల గణన ప్రకారం అక్కడ OBC + SC + ST 84% ఉన్నట్లు తేలింది. కేంద్ర ప్రభుత్వ 90 మంది కార్యదర్శులలో, కేవలం 3 మంది మాత్రమే OBC, భారతదేశ బడ్జెట్‌లో 5% మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయి. అందువల్ల, భారతదేశంలోని కుల గణాంకాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనాభా ఎక్కువుంటే వారికి హక్కులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరోవైపు బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో, వారికి అదే స్థాయిలో వాటా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని వనరులపై సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు ఉండాలని.. 2024లో కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తామని చెప్పారు.

ఇక ఈ ఏడాది కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా.. బిహార్ తర్వాత కుల గణనను విడుదల చేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. మరికొన్ని రోజుల్లో తమ రాష్ట్రంలో కూడా కుల గణనను చేపట్టబోతుందని తాజా పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో 2013-2018 మధ్య కాలంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు కుల, మత ఆధారిత జనాభాకు సంబంధించిన డేటా అందుబాటులో ఉండడంతో.. మరికొన్ని రోజుల్లోనే ఈ సర్వే చేపట్టనున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. అధికారంలో వచ్చిన తొలినాళ్లలో సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వేతో కులాల వారీగా తెలంగాణ‌లో ఎన్ని కుటుంబాలున్నాయో తేలిపోయింది. కులాల జ‌నాభాపైనా ఓ క్లారిటీ వ‌చ్చింది. ఈ లెక్కలతోనే రాష్ట్రంలో కూడా కులాల వారీగా జనాభా లెక్క ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో, వచ్చే ఎన్నికల్లో సైతం ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని రాజకీయ మేధావులు చెబుతున్నారు.

Updated : 3 Oct 2023 9:53 AM IST
Tags:    
Next Story
Share it
Top