శరద్ పవార్ ఇంటికి అజిత్ పవార్.. క్లారిటీ ఇచ్చిన నేతలు
X
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. కేబినెట్ విస్తరణ జరగిన గంటల వ్యవధిలోనే ఆయన ముంబైలోని ‘సిల్వర్ ఓక్’కు వెళ్లడంపై జోరుగా చర్చ సాగుతోంది. ఎన్సీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన అజిత్ పవార్ తన వర్గం నేతలతో ప్రభుత్వంలో చేరారు. ఈ పరిణామాల అనంతరం పవార్ ఇంటికి ఆయన వెళ్లడం ఇదే తొలిసారి.
ప్రభుత్వంలో చేరిన అనంతరం అజిత్ పవార్, శరద్ పవార్తో భేటీ అయ్యారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిపై అజిత్ పవార్ వర్గం నేతలు స్పందించారు. ఆ సమావేశం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. అనారోగ్యంతో ఉన్న శరద్ పవార్ భార్య ప్రతిభా పవార్ ను పరామర్శించడానికే అజిత్ సిల్వర్ ఓక్ కు వెళ్లాలని చెప్పారు.
శరద్ పవార్ భార్య ప్రతిభకు శుక్రవారం దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేతికి సర్జరీ జరిగింది. అనంతరం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. చిన్నమ్మను చూసేందుకు అజిత్ శరద్ నివాసానికి వెళ్లారు. అజిత్ పవార్ కు తన చిన్నమ్మ ప్రతిభతో సాన్నిహిత్యం ఉంది. 2019లో పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. అతన్ని తిరిగి ఎన్సీపీలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
జూలై 2న ఎన్సీపీని రెండు గా చీల్చిన అజిత్ పవార్ 30 మందికిపైగా ఎమ్మెల్యేలతో సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 10 రోజులు దాటిన అనంతరం శుక్రవారం వారికి శాఖలు కేటాయించారు. అజిత్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖ కేటాయించారు.