‘Delhi Chalo’ protest: రేపు అన్నదాతల 'ఢిల్లీ చలో'.. సరిహద్దులు బంద్
X
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్ల సాధనకై అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్చ్ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాలను మోహరించారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలోసింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 5,000 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు.. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు.
లక్షలాది సంఖ్యలో రైతులు ఢిల్లీ బార్డర్‌కు చేరుకొని బైఠాయించి నిరసన తెలుపుతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పంజాబ్-హర్యానా, ఢిల్లీ-హర్యానా సరిహద్దులలోని రోడ్లను బారికేడ్లు, బండరాళ్లు, ముళ్ల తీగలు, ఇనుప మేకులతో నింపేశారు. ఇసుకతో నింపిన టిప్పర్లను రోడ్లకు అడ్డంగా నిలబెట్టారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీ చుట్టూ ఉన్న బార్డర్ ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు. హర్యానా ప్రభుత్వం ఏడు జిల్లాల్లో మూడు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13న రాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్ ఉండదని తెలిపింది.
మరోవైపు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు కేంద్ర సర్కారు సిద్ధమైంది.తమ డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం తమను సోమవారం సమావేశానికి ఆహ్వానించిందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ వెల్లడించారు. ముగ్గురు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ సోమవారం చండీగఢ్‌కు చేరుకొని తమతో చర్చలు జరుపుతారని చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో దాదాపు 200 రైతుసంఘాలు ‘దిల్లీ చలో’ను తలపెట్టిన సంగతి గమనార్హం.