PM Modi : AI వినియోగానికి ఓ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం... ప్రధాని మోదీ
X
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సరైన పద్ధతిలో వినియోగించకపోతే ప్రపంచం ఉనికే ప్రమాదంలో పడే అవకాశముందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ శిఖరాగ్ర సదస్సు(గ్లోబల్ పార్టనర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ GPAI Summit) ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ.. AI టెక్నాలజీ ఉగ్రవాదుల చేతుల్లోపడితే ప్రపంచానికే పెద్ద ప్రమాదమని, టెక్నాలజీ సాయంతో మానవ రహిత దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సభకు హాజరైన మేధావులతో సహ ఇతర అధికారులకు సూచించారు. వివిధ అంతర్జాతీయ సమస్యల కోసం కాంట్రాక్టులు, ప్రోటోకాల్‌లు ఉన్నట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని ప్రధాని సూచించారు.
21వ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుతుందని, అయితే నాశనం చేయడంలోనూ అంతే శక్తివంతంగా ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. డీప్ ఫేక్ అలాంటి కోవకు చెందినదేనన్నారు. ప్రస్తుత, భవిష్యత్తు తరాలపై AI గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందని.. కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సు నుంచి వెలువడే సూచనలు, ఆలోచనలు ప్రపంచాన్ని AI చీకటి కోణాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, సవాళ్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయని భావిస్తున్నట్లు తెలిపారు. AI అభివృద్ధిని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వాటి ఫలితాలను ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని మోదీ తెలిపారు.