ఎయిర్ ఇండియా పైలట్ల నిర్వాకం.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
X
ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి పైలెట్ ప్రవర్తన వారిని చిక్కుల్లో పడేసింది. ఎయిర్ ఇండియా విమానం ఒకటి అత్యవసర లాండింగ్ చేయాల్సి వచ్చి జైపూర్ లో దిగింది. ఆ తర్వాత మళ్లీ టేక్ ఆఫ్ చేయాల్సి వచ్చినప్పుడు అందులో ఉన్న పైలెట్లు తాము టేక్ ఆఫ్ చేయనని చెప్పడం వివాదంగా మారింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-112 విమానం లండన్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న అత్యవసరంగా జైపూర్లో ల్యాండ్ అయ్యింది. లాండింగ్ అయిన దాదాపు రెండు గంటల తర్వాత ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. విమానం తిరిగి ఢిల్లీ వెళ్ళేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ఇక్కడే ఆ విమానంలో ఉన్న పైలెట్లు ట్విస్ట్ ఇచ్చారు.
తన డ్యూటీ టైం అయిపోయిందని ఒకరు, తనకు సంబంధం లేదని మరొకరు.. విమానాన్ని నడపబోనని పట్టుబట్టారు. దీంతో విమానంలోని 350 మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు విమానంలో ఉండిపోయారు. వాస్తవానికి విమానం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. జైపూర్ లో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇక చేసేది లేక ప్రయాణికుల్లో కొందరిని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి తరలించగా, విమాన సిబ్బందిని మార్చిన తర్వాత అదే విమానంలో మిగతా వారిని పంపించారు. ఆ విమానం కొన్ని గంటల తర్వాత తిరిగి ఢిల్లీ చేరుకుంది. జైపూర్లో తాము ఇబ్బంది పడుతున్న దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి నెట్టింట షేర్ చేశారు. అయితే ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటి వరకూ స్పందించలేదు.
Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK
— Adit (@ABritishIndian) June 25, 2023