ఎయిర్ ఏషియా నిర్వాకం.. గవర్నర్ను వదిలేసి ఫ్లైట్ టేకాఫ్
X
ఎయిర్ ఏషియా సిబ్బంది ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఎయిర్‌పోర్టు లాంజ్ లో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్నా కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ను వదిలేసి టేకాఫ్ చేశారు. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ హైదరాబాద్ వచ్చేందుకు గురువారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ ఏషియాకు చెందిన I5-972 ఫ్లైట్ మధ్యాహ్నం 2.05గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా గవర్నర్ 1.50 గంటలకు లాంజ్ కు చేరుకున్నారు. ఎయిర్ ఏషియా సిబ్బంది ఆయన లగేజీని కూడా ఫ్లైట్ లోకి ఎక్కించారు. రెస్ట్ రూంకు వెళ్లిన గహ్లోత్ వీఐపీ లాంజ్ నుంచి టర్మినల్ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌కు టేకాఫ్ అయిపోయింది. గవర్నర్ బోర్డింగ్ గేట్‌కు చేరుకోవడం ఆలస్యం కావడం వల్లే విమానం వెళ్లిపోయిందని ఎయిర్ ఏషియా ప్రతినిధులు చెప్పారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ కు 5 నిమిషాల ముందే అక్కడకు చేరుకున్నా విమానంలోకి ఎక్కనివ్వలేదని గవర్నర్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఏషియా సిబ్బందిపై గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. 90 నిమిషాల అనంతరం గహ్లోత్ మరో ఫ్లైట్ లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఏషియా ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.