బీజేపీ-శివసేన ప్రభుత్వంలో అందుకోసమే చేరా : అజిత్ పవార్
X
అజిత్ పవార్.. ఎన్సీపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసి బీజేపీ - శివసేనతో జతకట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. తాజాగా తాను ఆ కూటమితో ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే ఆ కూటమిలో చేరినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా బారామతి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.
‘‘గతంలో ప్రధానిని విమర్శించాను. కానీ ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు చూసి వారితో జతకట్టాలని నిర్ణయించుకున్నా. దేశాభివృద్ధి కోసం మోదీ ఎంతో కష్టపడుతున్నారు. అందుకే బీజేపీ - శివసేన ప్రభుత్వంలో చేరాను. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం చేరా. 2004లో ఎన్సీపీ అభ్యర్థికి సీఎం అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ తమ పార్టీ ఆ పదవిని కోరుకోలేదు’’ అని చెప్పారు.
అజిత్ పవార్.. బీజేపీ - శివసేన ప్రభుత్వంలో చేరినప్పటికీ.. శరద్ పవార్తో మాత్రం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో శరద్ పవార్ సైతం బీజేపీతో జట్టు కడతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తున్నారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదని.. మెజార్టీ సభ్యులు పార్టీతోనే ఉన్నారని శరద్ పవార్ స్పష్టం చేశారు.