Maharashtra Politics:ఆ పార్టీ మీది కాదు.. శరద్ పవార్‌కు ఎన్నికల సంఘం షాక్... NCP
X
రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన కీలక శరద్ పవార్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ దే అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. ఎన్‌సీపీ గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గానికి కేటాయిస్తూ.. అసలైన ఎన్‌సీపీ వారిదేనని గుర్తించింది. ఆరు నెలల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు నిర్ణయానికి వచ్చింది. శాసనసభలో మెజారిటీ నిరూపించుకున్న నేపథ్యంలో ఎన్సీపీ గుర్తు అజిత్ వర్గానికే చెందుతుందని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం తమ పార్టీకి కొత్త పేరు పెట్టుకునే వీలు కల్పిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. కొత్త పార్టీ కోసం మూడు పేర్లను సూచించాలని, శరద్ పవార్ కు రేపు సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇచ్చింది. మహారాష్ట్రలో గతంలో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి షాకిచ్చిన కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పుడు శరద్‌పవార్‌కు అంతకంటే పెద్ద షాకివ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా.. ఈ విచారణకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్వయంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆయనతోపాటు ఆయన మద్ధతుదారులు కూడా హాజరయ్యారు. ఎన్నికల సంఘం.. తమకే అనుకూలంగా ఫలితాన్ని ఇస్తుందని అంచనా వేశారు. గతంలో శివసేన పార్టీకి ఇచ్చిన ఫలితాలను పోల్చుకుంటూ.. శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే సజీవంగా లేరు కాబట్టి ఆ పార్టీ గుర్తును ఉద్దవ్ థాక్రేకు కాకుండా ఏక్ నాథ్ షిండేకు కేటాయించారని భావించింది. ఇక ఎన్సీపీ విషయంలో అధ్యక్షుడు శరద్ పవార్ మాత్రం బతికే ఉన్నందున ఎన్నికల సంఘం ఫలితం ఎలా ఉంటుంది? దీనిపై ఆసక్తి కలిగింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం శివసేనకు ఇచ్చిన ఫలితాన్నే ప్రకటించింది.