Akhilesh Yadav : ఇవాళ సీబీఐ విచారణకు అఖిలేష్ యాదవ్
X
సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఇవాళ సీబీఐ విచారించనుంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు నిన్న నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో తెలిపింది. అఖిలేష్ సీఎంగా ఉన్న సమయంలో అక్రమ మైనింగ్ జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కొందరికి మైనింగ్ హక్కులు ఇచ్చి లబ్ది పొందినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. 2012-2016 వరకు అఖిలేష్ సీఎంగా ఉన్నారు.
ఇక 2012-2013 వరకు ఆయనే స్వయంగా మైనింగ్ శాఖను చూశారు. దీంతో ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో 2019లో యూపీలోని హమీర్పూర్,జలాన్,నోయిడా, కాన్పూర్ సహా పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే సీబీఐ విచారణకు అఖిలేష్ వెళ్తారా లేక డుమ్మా కొడతారా అన్నది ఆసక్తిగా మారింది.