Ram Mandir : రోజూ గంటపాటు అయోధ్య రామయ్యకు విశ్రాంతి.. ఆలయం మూసివేత
X
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామయ్యను చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. బాల రామయ్యను దర్శించుకునేందుకు సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకూ పోటెత్తుతున్నారు. దీంతో ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్ట్ దర్శన వేళల్ని పెంచింది. అయితే తాజాగా ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయాన్ని ఇకపై ప్రతి రోజూ మధ్యాహ్నం గంట పాటు మూసివేయనున్నట్లు రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ వెల్లడించారు.
రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ ఆలయ ద్వారాలు మూసి ఉంచనున్నట్లు ఆచార్య సత్యేంద్రదాస్ తెలిపారు. సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఆలయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని మార్చింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆలయ వేళల్ని పెంచింది. జనవరి 23వ తేది నుంచి తెల్లవారు జామున 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ ప్రారంభం అవుతుండగా రాత్రి 10 గంటల వరకూ భక్తులకు దర్శనం కల్పిస్తూ వస్తున్నారు.
బాల రామయ్య ఐదేళ్ల పిల్లాడు అని, ఎక్కువ సమయం మెలకువగా ఉండటం వల్ల ఒత్తిడిని భరించలేడని, అందుకే బాల రామయ్యకు విశ్రాంతి ఇస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. అందుకే ఆలయం తలుపులు రోజూ గంట పాటు మూసివేయాలని నిర్ణయించినట్లు అయోధ్య ఆలయ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. రామయ్యకు విశ్రాంతి ఇవ్వడం కోసమే ఆలయాన్ని రోజూ గంట పాటు మూసివేస్తున్నట్లు ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.