Uttarkashi Tunnel : ఫలించిన 17 రోజుల ఎదురుచూపులు.. ఉత్తర కాశీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
X
17 రోజుల ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. నిర్విరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఉత్తరాఖండ్ టన్నెల్‌లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. నవంబర్ 12న నిర్మాణంలో ఉన్న సొరంగం ప్రమాదవశాత్తూ కూలడంతో.. 17 రోజుల పాటు భూగర్భంలో బందీలుగా చిక్కుకుపోయిన కార్మికులు ప్రాణాలతో బయటకొచ్చారు. స్ట్రెచర్ సహాయంతో ఒకరి తర్వాత ఒకరిని బయటకి తీసుకొచ్చారు.
‘ర్యాట్ హోల్ మైనింగ్’ టెక్నిక్ ఉపయోగించిన రెస్క్యూ బృందాలు 41 మంది కూలీలు చిక్కుకున్న ప్రాంతం వరకు డ్రిల్లింగ్ చేపట్టారు. అందులోకి గొట్టాన్ని పంపించి దాని ద్వారా కూలీలను ఒక్కొక్కర్ని బయటకు తీసుకువచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 41 మందిలో 15 మంది కూలీలు జార్ఖండ్ కు చెందిన వారే ఉన్నారు. ఏడుగురు ఉత్తరప్రదేశ్, ఐదుగురు బీహార్, ఐదుగురు ఒడిశా, ముగ్గురు పశ్చిమ బెంగాల్, ముగ్గురు ఉత్తరాఖండ్, ఇద్దరు అస్సాం, హిమాచల్ ప్రదేశ్ కి చెందిన వారు ఒకరు ఉన్నారు. ఈ సొరంగంలో నుంచి బయటకు తెచ్చిన వెంటనే వారిని ఉత్తరాఖండ్‌లోని చిన్యాలిసౌర్ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకోవడం లేదా వైద్య సలహాలు ఇచ్చి ఇంటికి పంపనున్నారు.
కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను అధిగమించి సహాయక సిబ్బంది వారి ప్రాణాలను కాపాడారు. సొరంగ శిథిలాల్లో 57 మీటర్ల పొడవునా గొట్టపు మార్గాన్ని వేస్తే కూలీల వద్దకు చేరుకోవచ్చని గుర్తించిన అధికారులు.. అందుకోసం ఆగర్ యంత్రంతో డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత.. ప్రమాదవశాత్తూ సొరంగంలోని ఇనుపపట్టీని ఢీకొట్టడంతో బ్లేడ్లు విరిగిపోయి యంత్రం పనిచేయలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. అదే సమయంలో సొరంగంలో చిక్కుకున్న ఆగర్ మిషన్ శిథిలాలను కట్టర్ సాయంతో తొలగించారు. ఆ తర్వాత 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను రంగంలోకి దింపి మిగతా డ్రిల్లింగ్ పని పూర్తిచేశారు.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami and Union Minister General VK Singh meet the workers who have been rescued from inside the Silkyara tunnel pic.twitter.com/beuPxZYpxe
— ANI (@ANI) November 28, 2023