ముస్లింలంతా హిందూమతం నుంచి కన్వర్ట్ అయినవాళ్లే : గులాం నబీ ఆజాద్
X
కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూ మతమే అతి పురాతన మైందని, ఇస్లాం మతం కంటే ముందునుంచే హిందుత్వం ఉందన్నారు. భారత్ లోని వ్యక్తులందరూ మొదట హిందూ మతంతో సంబంధం కలిగి ఉన్నవాళ్లేనని అన్నారు. జమ్ముకశ్మీర్, దోడా జిల్లాలోని థాత్రీ ప్రాంతంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆజాద్.. ఈ వ్యాఖ్యలు చేశారు. 1500 ఏళ్ల క్రితం ఇస్లాం మతం ఉద్భవించింది. అయితే హిందూ మతానికి ప్రాచీన చరిత్రుందని చెప్పుకొచ్చారు.
చరిత్రలో కొంతమంది ముస్లింలు వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి మొఘల్ సైన్యంలో పాల్గొని ఉండొచ్చని అన్నారు. దాంతో హిందువులు ముస్లింలుగా మత మార్పిడి చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆరు శతాబ్ధాల క్రితం ప్రధాన జనాభా కాశ్మీరీ పండిట్ లు కలిగి ఉన్నారని.. వారి నుంచి మత మార్పిడి జరిగిందని అన్నారు. మొదట అందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ, హిందూ ధర్మంలోనే జన్మించారని అన్నారు. 600 ఏళ్ల క్రితం 10 నుంచి 20 మంది ముస్లింలు భారత్ లోకి ప్రవేశించి.. మత మార్పిడికి ప్రేరేపించారని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.