Home > జాతీయం > మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్కు సర్వం సిద్ధం

మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్కు సర్వం సిద్ధం

మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్కు సర్వం సిద్ధం
X

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మిజోరంలోని 40 స్థానాలకు ఒకే దశలో.. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు తొలి విడత పోలింగ్‌ జరగనుంది.

మిజోరంలో మొత్తం 8.50 లక్షల మందికిపైగా ఓటర్లు ఉండగా.. వీరిలో 4,13,064 మంది పురుషలు, 4,39,028 మంది మహిళలు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిజోరంలో ఈసారి ఎన్నికల్లో 50,611 మంది తొలిసారి ఓటు వేయనున్నారు. మిజోరం ఓటర్లు బరిలో ఉన్న 174 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని మంగళవారం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా 50 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. థొరాంగ్‌ నియోజకవర్గంలోని తెలెప్‌ పోలింగ్‌ కేంద్రంలో కేవలం 26 మంది ఓటర్లు ఉండగా.. జెమాబ్వాక్‌ VIII పోలింగ్‌ స్టేషన్‌లో అత్యధికంగా 1,481మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. జడ్‌పీఎం, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పాలనాపగ్గాలు చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 20 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. మిగతా 70 సీట్లకు ఈ నెల 17న రెండో విడతలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. తొలి దశలో 40,78,680 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. వీరిలో 19,93,936మంది పురుషులు.. 20,84,675మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,64,299 మంది యువతీయువకులు తొలిసారి ఓటు వేయనున్నారు.

20 నియోజకవర్గాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 5,304 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 60వేల మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.




Updated : 6 Nov 2023 2:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top