పృథ్వీ షాకు బిగ్ రిలీఫ్.. ఆమెవి తప్పుడు ఆరోపణలన్న పోలీసులు
X
క్రికెటర్ పృథ్వీ షాకు బిగ్ రిలీఫ్ దక్కింది. పృథ్వి షా తనను లైంగికంగా వేధించారని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్న గిల్ చేసిన ఆరోణలు వాస్తవం కాదని పోలీసులు తేల్చారు. గిల్ తప్పుడు ఆరోపణలు చేశారని.. అవి నిరాధారమైనవని అంధేరీ మెజిస్ట్రేట్కు పోలీసులు నివేదిక సమర్పించారు. పృథ్వీ తనను వేధించాడని, బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశాడని సప్న అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించడంతో పోలీసులు విచారణ జరిపారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 15న ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద పృథ్వీ షా, అతడి స్నేహితులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పృథ్వీ షా సెల్ఫీ నిరాకరించడంతో అతడితో దురుసుగా ప్రవర్తించడమే కాక, స్నేహితుడి కారును ధ్వంసం చేశారు. అంతేగాక, తప్పుడు కేసు పెడతామంటూ నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సప్నా గిల్ సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సప్నా గిల్‌ను కోర్టులో హాజరుపర్చగా.. ఆమెకు మూడు రోజుల కస్టడీ విధించారు.
బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా.. అంధేరీ పోలీసు స్టేషన్‌లో పృథ్వీ షా అతడి స్నేహితులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.ఆమె ఫిర్యాదును స్వీకరించిన మేజిస్ట్రేట్ ఈ అంశంపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోను మేజిస్ట్రేట్‌కు సమర్పించడానికి కాస్త సమయం కావాలని సప్నా గిల్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో విచారణను కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. అయితే ఇవాళ కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.