Home > జాతీయం > Amit Shah : కేసీఆర్ కుంభకోణాలు తప్ప.. ఇంకేం చేయలేదు: అమిత్ షా

Amit Shah : కేసీఆర్ కుంభకోణాలు తప్ప.. ఇంకేం చేయలేదు: అమిత్ షా

Amit Shah : కేసీఆర్ కుంభకోణాలు తప్ప.. ఇంకేం చేయలేదు: అమిత్ షా
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సభలు, సమావేశాలతో దూసుకుపోతుంది. బీజేపీ అభ్యర్థుల తరపున అధిష్టానం రంగంలోకి దిగి ప్రచారం చేస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరును ఎండగట్టారు. తెలంగాణలో 1500 మందిపైగా ఆత్మబలిదానం చేసుకుంటే రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. వారి త్యాగం వల్ల అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఈ పదేళ్లలో అవినీతి తప్ప ఇకేం చేయలేదని ఆరోపించారు. మిగులు ఆదాయ రాష్ట్రం ఈ పదేళ్లలో దివాలా తీసిందని బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

ఈ నెల 30న జరిగే ఎన్నికలు రాష్ట్రానికి, ప్రజలకు అత్యంత కీలకమని అమిత్ వెల్లడించారు. మీ ఓటు తెలంగాణ, దేశ భివిష్యత్ ను నిర్ణయిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు, యువత తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈసారి ఆ పార్టీ ఓటమి ఖాయమని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతోంది. భూముల వేలంలో రూ. 4వేల కోట్లు, కాళేశ్వరం, ఓఆర్ఆర్ లీజులో అక్రమాలు జరిగాయని తీవ్రంగా ఆరోపించారు. మిషన్ భగీరథ, మియాపూర్ భూములు, పాస్ పోర్ట్ కుంభకోణాలు, గ్రానైట్ కుంభకోణంలో కోట్ల రూపాయల మనీలాండరింగ్ జరిగింది. మిషన్ కాకతీయలో వేల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదు. లక్ష ఉద్యోగాలు అన్నారు ఎన్ని భర్తీ చేశారు? నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ విద్య, రూ. లక్ష రుణ మాఫీ, ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇలా ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేక బీఆర్ఎస్ ఫెయిల్ అయింది.

బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిచేసింది. కేసీఆర్ సర్కారు సహకరించకపోయినా తమ సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలో తెలంగాణలో 2.5 లక్షల ఇల్లు కట్టామని గుర్తుచేశారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను కేసీఆర్ నిండా ముంచారని అమిత్ షా ఆరోపించారు. క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి కుంభకోణానికి పాల్పడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు జరగలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మార్పు కావాలనుకుంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. బీఆర్ఎస్ 2G (కేసీఆర్, కేటీఆర్) పార్టీ. మజ్లిస్ 3G- మూడు తరాల పార్టీ. కాంగ్రెస్ 4G పార్టీ (నెహ్రు, ఇందిర, రాజీవ్, రాహుల్) పార్టీలని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఒవైసీకి ఓటేసినా, కాంగ్రెస్ కు ఓటేసినా బీఆర్ఎస్ కు ఓటేసినట్లేనని అన్నారు. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ కు అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు.

కేసీఆర్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలతో తెలంగాణ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింటుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వాహణపై ఇచ్చిన మాట కూడా తప్పారు. ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారు. దేశంలో మతపరమైన హామీలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బీజేపీ అధికారంలోకి రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. తమకు అధికారమిస్తే క్వింటాల్ వరికి రూ.3100 చెల్లిస్తాం. అధికారంలోకి వస్తే తెలంగాణలో పండే ధాన్యం, బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తాం. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.




Updated : 25 Nov 2023 6:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top