కాశ్మీర్‌లో ఉచితంగా బంగారం పంపిణీ..కానీ షరతులు వర్తిస్తాయి
X
ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి ఐడియానే ఓ గ్రామ రూపురేఖలనే మార్చేసింది. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో కాశ్మీర్‌లో అమలు చేసి ఓ వినూత్నమైన ఐడియా బాగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఐడియాపైనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
కేంద్ర పాలిత ప్రాంతంమైన కాశ్మీర్ పేరు వినగానే అక్కడి అందమైన ప్రదేశాలు కళ్ల ముందు కదలాడుతాయి. చాలా మంది ఈ సుందరమైన ప్రదేశాలను ఒక్కసారైనా చుట్టుముట్టాలని కలలు కంటుంటారు. కానీ గత కొంత కాలంగా దక్షిణ కాశ్మీర్‌లో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఎన్ని నివారణ చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. దీంతో ఈ విషయాన్ని గుర్తించిన అనంతనాగ్ జిల్లాలోని సాదివారా గ్రామానికి చెందిన వారు ఓ ఐడియాతో తమ గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చుకోవాలనుకున్నారు. వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణం ప్లాస్టిక్ అని తెలుసుకుని. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే గోల్డ్ కాయిన్ ఇచ్చే ఆఫర్ ప్రకటించారు గ్రామ పెద్దలు. ఇంకేముంది కొన్ని రోజుల్లోనే ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. కాలుష్య రహిత గ్రామంగా మారింది.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు సాదివారా గ్రామ పంచాయతీ పెద్దలు ఈ ఐడియాను ప్రవేశపెట్టారు. "ప్లాస్టిక్ ఇవ్వండి.. బంగారం తీసుకోండి" అనే నినాదానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ఈ పథకంలో భాగంగా గ్రామానికి చెందిన వారు ఎవరైనా 20 క్వింటాళ్ల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను కనుక ఇస్తే.. వారికి పంచాయతీ ఓ బంగారు కాయిన్ ఇస్తుంది. మార్కెట్ లో బంగారం ధరలు మండుతున్న ఈ రోజుల్లో ఈ ఆఫర్ ప్రకటించడంతో ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఎగబడ్డారు. బంగారు కాయిన్ ను పొందేందుకు ఎగబడ్డారు. దీంతో కేవలం 15 రోజుల్లోనే ఆ గ్రామం రూపు రేఖలు మారిపోయాయి. కాలుష్యం దరిదాపుల్లో కనిపించలేదు. ఈ స్కీముకు గ్రామంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇతర పంచాయతీల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముందకు వస్తున్నారు గ్రామ పెద్దలు.