Home > జాతీయం > టీ అడిగితే ఇవ్వలేదని... చేయాల్సిన ఆపరేషన్‌ను ఆపేసిన డాక్టర్

టీ అడిగితే ఇవ్వలేదని... చేయాల్సిన ఆపరేషన్‌ను ఆపేసిన డాక్టర్

టీ అడిగితే ఇవ్వలేదని... చేయాల్సిన ఆపరేషన్‌ను ఆపేసిన డాక్టర్
X

సిబ్బంది తనకు ఇవ్వాల్సిన టీ విషయంలో ఆలస్యమైందని ఓ డాక్టర్ చేస్తున్న ఆపరేషన్‌ను మధ్యలోనే వదిలేశాడు. మహారాష్ట్ర నాగపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది. స్థానిక మౌదా తహసీల్‌ లోని ప్రభుత్వ ఆధీనంలోని ఆరోగ్య కేంద్రంలో ఓ డాక్టర్... కప్పు టీ ఇవ్వని కారణంగా ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. తేజ్‌ రామ్‌ అనే వైద్యుడు తనకు టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతని మీద ఉన్నతాధికారులు విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

జిల్లాలోని ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు. వారికి ఆపరేషన్‌ చేయాల్సిన డాక్టర్‌ తేజ్‌రామ్‌ భలవి ఆపరేషన్‌ చేసే ముందు టీ కావాలని ఆసుపత్రి సిబ్బందిని అడిగారు. అయితే సిబ్బంది టీ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆ కోపంతోనే థియేటర్‌ లోపలికి వెళ్లిన తేజ్ రామ్‌... లోపల మహిళలకి ఎవరికి కూడా ఆపరేషన్‌ చేయకుండా బయటకు వచ్చేశారు.

దీంతో ఆపరేషన్‌ కోసం మత్తు ఇచ్చిన నలుగురు మహిళలు కూడా అలాగే ఆపరేషన్ బెడ్ల మీద ఉండిపోయారు. టీ ఇవ్వకపోవడం వల్లే డాక్టర్‌ ఆపరేషన్లు చేయకుండా వెళ్లిపోయాడని తెలుసుకున్న జిల్లా యంత్రాంగం మరో వైద్యుని ఏర్పాటు చేసింది. ఆపరేషన్లను మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన తేజ్ రామ్‌ పై విచారణ జరపాలని ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ విషయం గురించి జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు కుందా రౌత్‌ స్పందించారు. కేవలం ఒక టీ కోసం ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిన వైద్యుని మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. డాక్టర్‌ వల్ల ఆ నలుగురు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అలానే డాక్టర్​ తేజ్​రామ్​ భలవిపై ఐపీసీ 304 సెక్షన్​ కింద ఫిర్యాదు చేయాలని డిమాండ్​ చేశారు.




Updated : 8 Nov 2023 9:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top