Parliament : పార్లమెంటులో సేమ్ సీన్.. సభ నుంచి మరో 49 మంది సస్పెండ్
X
పార్లమెంటులో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో మంగళవారం సైతం లోక్ సభ నుంచి 50 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారన్న కారణంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉభయ సభల నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపీల సంఖ్య 140కు చేరువైంది.
సోమవారం 92 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. స్పీకర్ ఎంత నచ్చజెప్పినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గేందుకు నిరాకరించారు. దీంతో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు సుప్రియా సూలే, మనీష్ తివారీ, శశి థరూర్, ఎండీ ఫైజల్, కార్తి చిదంబరం, సుదీప్ బందోపాధ్యాయ, డింపుల్ యాదవ్, డానిష్ అలీ సహా మొత్తం 50 మంది విపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.