Home > జాతీయం > మణిపూర్ మంటల వెనుక... మయన్మార్ మత్తు..!

మణిపూర్ మంటల వెనుక... మయన్మార్ మత్తు..!

మణిపూర్ మంటల వెనుక... మయన్మార్ మత్తు..!
X

జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతోంది. గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఈ ఘర్షణల మాటున ఎన్నో అమానుష ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అవి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ యావత్ దేశాన్ని నివ్వెరపరుస్తున్నాయి. మెయిటీలకు ఎస్టీ హోదా నిరసిస్తూ కుకీ, నాగాలు మొదలుపెట్టిన హింస వెనుక మరో కోణం ఉన్నట్లు తెలుస్తోంది. అదే మయన్మార్ మత్తు.

ప్రపంచంలోనే డ్రగ్స్ ఉత్పత్తిలో మయన్మార్ది రెండవ స్థానం. ఈ మత్తుకు మణిపూర్ అల్లర్లకు సంబంధం ఉందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మయన్మార్‌ - భారత్‌ మధ్య 1640 కి.మీ. సరిహద్దు ఉండగా.. ఇందులో 400 కి.మీ. మణిపుర్‌తోనే ఉంది. ఈ సరిహద్దులో పది శాతం భూభాగంలోనే కంచె ఉండగా.. మిగితా అంతా సాధారణ భద్రతే ఉంటుంది. కంచె లేని ప్రాంతం గుండా మయన్మార్ నుంచి మణిపూర్లోకి డ్రగ్స్ సరాఫరా అవుతుంటాయని సమాచారం.

ఈ డ్రగ్స్ సరాఫరా వెనుక రాజకీయ నేతలు, వ్యాపారులు, పోలీసులు, అధికారుల హస్తం కూడా ఉందని ప్రచారం ఉంది. అటు మణిపూర్లోని కొండ ప్రాంతాల్లో ఉంటున్న కొన్ని తెగల ప్రజలు గంజాయి పంట పండిస్తారు. అయితే గత ఐదేళ్లుగా ప్రభుత్వం మత్తు పంటలపై ఉక్కు పాదం మోపుతోంది. దీంతో వారి బతుకుదెరువు భారంగా మారింది. అదే సమయంలో మెయిటీలకు ఎస్టీ హోదా అంశం తెరపైకి రావడంతో వారిలో అసంతృప్తి, ఆవేశం ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక దీనిని డ్రగ్స్ ముఠా క్యాష్ చేసుకుందనే ఆరోపణలున్నాయి. స్థానిక తెగలను రెచ్చగొట్టి హింసకు ఆజ్యం పోసినట్లు సమాచారం. ఘర్షణల వెనుక డ్రగ్స్ ముఠాల ప్రమేయం కొట్టిపారేయలేమనే కొందరి వాదన. అటు ఉగ్ర సంస్థలకు కూడా ఈ మారణ హోమంలో ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ముందుగా మయన్మార్ నుంచి వచ్చే మత్తును ఆపితే మణిపూర్ పరిస్థితి అదుపులోకి వస్తుందని అంటున్నారు. మరి కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.






Updated : 23 July 2023 2:48 PM IST
Tags:    
Next Story
Share it
Top