Delhi : రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం..60 మందికి గాయాలు
X
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పంజాబ్- హర్యానా సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు మరోసారి రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించడంతో రెండు సరిహద్దు పాయింట్ల వద్ద టియర్ గ్యాస్ షెల్స్‌ను పోలీసులు ప్రయోగించారు.
రైతుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. యూపీ, పంజాబ్, హర్యానాల నుంచి ఢిల్లీ నగరంలోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. పోలీసులు పెద్ద ఎత్తున సిమెంట్ బారీకేడ్లను, కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలను ఏర్పాటు చేసినప్పటికీ రైతులు వాటిని బద్దలుకొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే పోలీసులు రైతులపై దాడులకు యత్నించారు.
పోలీసులు దాడుల్లో 60 మందికి పైగా రైతులు గాయాలపాలయ్యారు. 200కు పైగా రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనను తెలుపుతున్నాయి. పంటకు కనీస మద్దతు ధర సహా 12 డిమాండ్లపై రైతులు కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు. వేల మంది రైతులు ఢిల్లీ చలో మార్చ్‌లో పాల్గొని తమ నిరసనను తెలుపుతున్నారు.