BIG BREAKING: ఆర్టికల్ 370 పై సుప్రీం సంచలన తీర్పు
X
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కాసేపటి క్రితం సంచలన తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. జమ్మూకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సవాలు చెయ్యడం సరికాదన్న సీజేఐ... రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం నిర్వర్తించలేదని తెలిపారు. ఐతే.. దేశంలో విలీనం అయినప్పుడు కశ్మీర్‌కి సార్వభౌమాధికారం లేదనీ, విలీనం తర్వాత కూడా సార్వభౌమాధికారం ఇవ్వలేదని సీజేఐ స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక వెసులుబాటు మాత్రమే అని తెలిపారు. దీంతో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరోక్షంగా సమర్థించినట్లైంది.
2019లో 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై సవాల్ చేస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు సుధీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా, ఇవాళ వెలువరించింది. ఇక తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొందరు నేతలను ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొంతమందిని హౌస్ అరెస్ట్‌లు చేశారు. మరోవైపు.. తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చినా శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ స్పష్టం చేసింది.