ఆహ్వానం అందలేదు.. కానీ కుటుంబ సభ్యులతో అయోధ్యకు వెళ్తా - సీఎం కేజ్రీవాల్
X
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవిదేశాలకు చెందిన 7వేల మంది అతిధులు ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే తాను మాత్రం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కుటుంబసభ్యులతో కలిసి వెళదామని అనుకున్నానని అయితే తనకు ఇప్పటి వరకు ఆహ్వానమే అందలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందింది. అయితే వారంతా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. బీజేపీ ఆ వేడుకను రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ అయోధ్య పర్యటనకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. వారం క్రితం జనవరి 22న అయోధ్యకు రావాలని, ఆ రోజున వేరే పనులేవీ పెట్టుకోవద్దని ఓ లెటర్ అందిందని, కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఇన్విటేషన్ అందలేదని కేజ్రీవాల్ చెప్పారు. వీఐపీల తాకిడి, భద్రతా కారణాల దృష్ట్యా తాను ఒక్కడినే రావాలని అందులో స్పష్టం చేశారని చెప్పారు.
ఇదిలా ఉంటే అయోధ్య రామయ్యను కళ్లరా చూడాలని తన తల్లిదండ్రులు కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసిన తర్వాత తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో కలిసి రామయ్య దర్శనానికి వెళ్తానని స్పష్టం చేశారు.