High Court : అకృత్యాన్ని అడ్డుకోనందుకు గ్రామస్థులకు కోర్టు జరిమానా!
X
కర్ణాటకలో మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై.. ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ (42)ను రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి, ఊరేగించి, హింసిస్తున్న వారిని అడ్డుకోకుండా చోద్యం చూస్తూ నిలుచున్నవారికి హైకోర్టు చీవాట్లు పెట్టింది.
బెళగావి జిల్లాలోని వంటమూరి గ్రామంలో ఇటీవల ఇద్దరు ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయిన ఘటనలో.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కలిసి అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం అబ్బాయి తల్లిని రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి, ఊరేగించారు. తర్వాత కరెంటు స్తంభానికి కట్టేశారు. ఆ సమయంలో దాదాపు 60 మంది గ్రామస్థులు జరుగుతున్న తతంగాన్నంతా చూస్తూ ఉండిపోయారు. ఆ గ్రామ సర్పంచ్ ఈ విషయం గురించి పోలీసులకు సమాచారమందించగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని సదురు మహిళను దవాఖానకు తరలించారు. దాడికి పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. గ్రామస్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అకృత్యాన్ని అడ్డుకోకుండా చోద్యం చూసిన వారికి జరిమానా విధించాలని, ఆ మొత్తాన్ని బాధిత మహిళకు ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాళె, జస్టిస్ కృష్ణ దీక్షిత్‌ల ధర్మాసనం సూచించింది. ‘ఇటువంటి అకృత్యాలు జరిగినప్పుడు అడ్డుకోకుండా కళ్లప్పగించి చూసేవారికి విలియం బెంటింక్ వైస్రాయిగా ఉన్నప్పుడు జరిమానా విధించేవారు’ అని ధర్మాసనం పేర్కొంది.