అయోధ్య రాముడి గర్భగుడి ఇదే.. జనవరి 24న దేశవ్యాప్త సెలవు!
X
అయ్యోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. వచ్చే నెలలో ఆలయలో విగ్రహ ప్రతిష్టకు రామాలయ ట్రస్ట్ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆలయం నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. రామ్ లాల్లా కొలువుదీరనున్న గర్భగుడి చిత్రాలను ట్రస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లేత గోధుమ రంగు శిలపై అందమైన పుష్పాలు, లతలతో గర్భగుడిని తీర్చిదిద్దారు. మందిరంలో రాముడ విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరపనున్న జనవరి 24న దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు.
లక్షలాది మంది హాజరుకానున్న విగ్రహ ప్రతిష్టకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అథిగా విచ్చేస్తారు. 130 దేశాల నుంచి రామభక్తులు హాజరు కానున్నారు. ముహూర్తం దగ్గర పడ్డంతో వందలాది కార్మికులు భారీ క్రేన్లు, ఇతర యంత్రాల సాయం రేయింబవళ్లు పని చేస్తున్నారు. అయోధ్య రామజన్మభూమి వివాదానికి సుప్రీం కోర్టు తెరదించి బాబరీ మసీదుకు వేరే చోట స్థలం కేటాయించడంతో ఆలయ పనులకు మార్గం సుగమమైంది. రూ. 2 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. భక్తుల నుంచి గత మూడేళ్లలో రూ. 4500 కోట్ల విరాళాలు వచ్చాయి. మరోవైపు బాబరీ మసీదుగా బదులుగా ధన్నిపూర్‌లో కేటాయించిన స్థలంలో ముస్లింల మసీదు నిర్మించనున్నారు. దానికి అనుబంధంగా కమ్యూనిటీ కిచెన్, మ్యూజియం, ఆస్పత్రి కూడా రాబోతున్నాయి. అయితే పనులు ఇంతవరకు మొదలు కాలేదు. వీటి కోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ దేశ విదేశాల నుంచి విరాళాలు సేకరిస్తోంది.