Ayodhya : టెంటును వదిలి ఆలయంలో అడుగుపెట్టనున్న రామయ్య
X
అయోధ్యలో ఇవాళ మరో అద్భుత ఘట్టం చోటు చేసుకోనుంది. కొత్తగా నిర్మించిన రామ మందిరంలోకి రాముడు అడుగుపెట్టనున్నాడు. ఏండ్లుగా తాత్కాలికంగా నిర్మించిన డేరాలో పూజలందుకుంటున్న బాల రాముడిని ఇవాళ ప్రధాన ఆలయంలోకి తీసుకెళ్లనున్నారు. దాదాపు 500ఏండ్ల తర్వాత రాముడు తన ఆలయానికి తిరిగి రానున్నాడు.
మరో రెండు రోజుల్లో రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఉంటడంతో ఇవాళ్టి నుంచి బయటి వ్యక్తులను అయోధ్యలోకి ప్రవేశం లేదు. జనవరి 20 నుంచి 22 వరకు అయోధ్య ధామ్ హై సెక్యూరిటీ జోన్‌లో ఉంటుంది. రాంనగరి సరిహద్దులన్నీ మూసివేయనున్నారు. సంప్రోక్షణ కోసం అయోధ్య మొత్తాన్ని కంటోన్మెంట్ ఏరియాగా మార్చబడింది.
రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రధాని సహా పలువురు ప్రముఖులు రానున్న నేపథ్యంలో అయోధ్యలో భద్రత కట్టుదిట్టం చేశారు. ముగ్గురు డీఐజీలు, 17 మంది ఐపీఎస్‌లు, 100 మంది పీపీఎస్ స్థాయి అధికారులు అయోధ్యలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు 325 మంది ఇన్‌స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. యూపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు అయోధ్యలో మోహరించాయి.