రూ.10 కోట్లు సరిపోకపోతే ఇంకా ఇస్తా..అయోధ్య స్వామీజీ
X
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవలె ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న అయోధ్య స్వామీజీ సంచలన ప్రకటన చేశారు. ఉదయనిధి తల నరికి తీసుకొస్తే రూ.10 కోట్ల ఇస్తానని జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించారు.అయోధ్యలో ఉదయనిధి ఫొటోను కత్తితో పొడిచి తన నిరసనను వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయంలో స్వామీజీ మరో కీలక ప్రకటన చేశారు. ఉదయనిధి తల నరికితే ముందుగా ఇస్తానన్న రూ.10 కోట్లు సరిపోకపోతే ఇంకా ఇస్తాను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అలా చేయడానికి ఎవరూ రాకపోతే తానే నరుకుతానని చెప్పారు. పరమహంస ఆచార్య ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా
సమాజ్‌వాదీ పార్టీ నాయకులు స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపైన, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమా పఠాన్ లో దీపికా పదుకునే కాషాయ రంగు బికినీ వివాదంపైన ఆయనఇలాంటి ప్రకటనలే చేశారు.
ఇదిలా ఉంటే సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన పలువురు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. మొత్తం 262 మంది కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఉదయనిధి దేశంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వారిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని లేఖలో తెలిపారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కూడా కనీసం క్షమాపణ చేప్పలేదని లేఖలో ఆయనపై ఆరోపించారు. దేశ లౌకిక స్వభావాన్ని కాపాడేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రధాన న్యాయమూర్తిని వారు కోరారు. అంతే కాదు ఉదయనిధిపై యాక్షన్ తీసుకోవడంలో తమిళనాడు సర్కార్ అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.