మకర జ్యోతి దర్శనం.. అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిన శబరిగిరులు
X
హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. దీంతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఏటా సంక్రాంతి పర్వదినం రోజున పొన్నాంబలమేడుపై మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఆ జ్యోతిని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివస్తారు.
సంక్రాంతి రోజు సాయంత్రం పందళరాజవంశీయులు తిరువాభరణాలతో సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతం పలుకుతారు. రాజ వంశీయులు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పొన్నాంబలమేడు వద్ద మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించిన అనంతరం స్వాములు ఇరుముడి సమర్పిస్తారు.
41 రోజుల పాటు నియమ నిష్టలతో మాల ధరించిన స్వాములు మకరజ్యోతి దర్శనం కోసం ఎదురుచూస్తారు. ఏటా సంక్రాంతి రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఉంటుంది. ఏటా జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ ఏడాది కూడా జ్యోతి దర్శనం కావడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. 50 వేల మందికి టోకెన్లు ఇచ్చింది. భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చినందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్‌టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతిని దర్శించుకునే ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేలాది మందితో పహరా ఏర్పాటు చేసింది. జ్యోతి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న అయ్యప్పమాలధారులతో పాటు సాధారణ భక్తులు లక్షలాదిగా తరలివెళ్లారు.