బాబర్, ఔరంగజేబులకే చేతగాలేదు, మీరెంత?... సనాతనపై సీఎం
X
సనాతన ధర్మం ఓ అంటువ్యాధి వంటిందని, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం ఆగడం లేదు. అటు రాజకీయ నేతలు, ఇటు నెటిజన్లు సనాతన అనుకూల, సనాతన వ్యతిరేక వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మాన్ని చరిత్రలో పేరు మోసిన ఘనులే ఏమీ చేయలేకపోయారని ఉదయనిధిలాంటి వాళ్లు ఎంత అని సీఎం ట్వీట్ చేశారు.
‘‘రావణుడి అహంకారంతో సనాతన ధర్మం నిర్మూలన కాలేదు
కంసుడి గర్జనకు సనాతన ధర్మం చలించలేదు
బాబర్, ఔరంగజేబుల దుర్మార్గాలతో సనాతన ధర్మం అంతం కాలేదు
అలాంటి సనాతన ధర్మం ఇలాంటి అల్ప పరాన్నజీవులతో ఎలా అంతమవుతుంది?’’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, తను ఏ సామాజిక వర్గాన్నీ వ్యతిరేకించడం లేదని ఉదయనిధి వివరణ ఇచ్చారు. తనుగాని, డీఎంకే పార్టీ గానీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. మరోపకక్క.. బాహుబలి కట్టప్ప సత్యరాజ్ ఉదయనిధికి గట్టిగా మద్దతు పలికారు. మంత్రి మాటల్లో తప్పేముందని, ఆయన ధైర్యంగా తన అభిప్రాయాలు చెప్పినందుకు అభినందిస్తున్నానన్నారు.