బీజేపీకి షాక్... తిరిగి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే
X
మధ్యప్రదేశ్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దూకుడు పెంచిన పార్టీలు ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో బీజేపీకి షాక్ తగిలింది. గతంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి హస్తం గూటికి చేరుకున్నాడు. 400కార్లతో 300 కి.మీ.ల ర్యాలీతో వచ్చి పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
బైజ్‌నాథ్ యాదవ్ 2020లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అప్పుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడంతో ఆయనతో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ సర్కార్ కూలిపోయి.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా బైజ్నాథ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ సీఎం కమల్ నాథ్, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బైజ్‌నాథ్ యాదవ్ తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు.
అంతకుముందు శివపురి నుంచి 400 కార్ల కాన్వాయ్‌తో భోపాల్‌లోని కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. 400 కార్లతో 300 కిలోమీటర్లు సైరన్లు మోగించుకుంటూ ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే సైరన్లు మోగించడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఎమర్జెన్సీ వాహనాలు మాత్రమే రోడ్లపై సైర్లను మోగించాలి.. కానీ బలప్రదర్శనలు చేయడానికి వాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.