అనురాగ్ ఠాకూర్తో సాక్షి, బజరంగ్ పునియా భేటీ.
X
కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షిమాలిక్ భేటీ అయ్యారు. బుధవారం ఉదయం వారిద్దరూ ఆయన నివాసానికి వెళ్లారు. రెజ్లర్ల సమస్యపై చర్చించేందుకు సిద్ధమంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేయడంతో బజరంగ్ పునికా, సాక్షిలు ఆయనతో భేటీకి సిద్ధమయ్యారు. గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. దీంతో ఇవాళ్టి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
అరెస్ట్ చేయాల్సిందే..
సమావేశానికి వెళ్లే ముందు ముందు మీడియాతో మాట్లాడిన సాక్షి మాలిక్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రెజ్లర్లను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన ట్వీట్ పై ఆమె స్పందించారు. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను విరమించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనతో ముందుకొస్తుందో పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని సాక్షి స్పష్టం చేశారు.
నిద్రమత్తు వీడిన సర్కారు
ప్రభుత్వంతో చర్చల ఫలితం కోసం తాము వేచిచూస్తున్నామని మహిళా రెజ్లర్లు అంటున్నారు. చర్చల అనంతరం పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి అమిత్ షాతో రెజ్లర్ల సమావేశం అసంపూర్తిగా ముగియడంతో అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్ల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర మంత్రి రెజ్లర్లను చర్చలకు ఆహ్వానించడంపై ద్రోణాచార్య అవార్డు గ్రహీత, రెజ్లింగ్ కోచ్ మహవీర్ సింగ్ ఫొగట్ స్పందించారు. నిద్రలో మత్తులో ఉన్న ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవడం సంతోషకరమని ఆయన వ్యాఖ్యానించారు.
క్రీడా మంత్రి ట్వీట్
మరోవైపు రెజ్లర్లను చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వంతో రెజ్లర్ల సమావేశంపై స్పందించేందుకు బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ సింగ్ నిరాకరించారు.
Delhi | Wrestler Sakshee Malikkh arrives at the residence of Union Sports Minister Anurag Thakur after an invitation from the government for talks with protesting wrestlers pic.twitter.com/iiOKQH5Y8v
— ANI (@ANI) June 7, 2023