Home > జాతీయం > బండి సంజయ్కు ఏపీ ఇంఛార్జ్ బాధ్యతలు..!

బండి సంజయ్కు ఏపీ ఇంఛార్జ్ బాధ్యతలు..!

బండి సంజయ్కు ఏపీ ఇంఛార్జ్ బాధ్యతలు..!
X

బండి సంజయ్కు ప్రమోషన్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనకు మరో కీలక బాధ్యత అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శనివారం ప్రకటించిన 8మంది జాబితాలో దక్షిణాది నుంచి బండికి మాత్రమే చోటు దక్కింది. ఈ క్రమంలో ఆయనను ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏపీ ఇంఛార్జిగా ఉన్న సునీల్‌ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని బండితో భర్తీ చేయనున్నట్లు పార్టీ ఇంటర్నల్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.సంజయ్‌ను ఏపీ వ్యవహారాల ఇంఛార్జిగా నియమించడం ద్వారా వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు బలమైన గళం అందివస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

ఏపీలో పార్టీని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా బీజేపీ పెద్దలు ఇటీవల సోమువీర్రాజును రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. పురంధేశ్వరికి పగ్గాలు అప్పగించారు. ఆమె కాస్త దూకుడుగా వెళుతున్నా పార్టీ బలోపేతానికి అది సరిపోదని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీకి ఊపుతెచ్చిన బండి అయితేనే ఏపీలో కూడా పార్టీ పట్టాలెక్కుతుందని బీజేపీ పెద్దలు నిర్ణయంచినట్లు సమాచారం.

బండి సంజయ్‌ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక పార్టీకి కొత్త జోష్ వచ్చింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చారు. పార్టీ కేడర్‌ను ఏర తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో బండి హయాంలోనే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపు వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే ముందుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆ బాధ్యతలు బండి సంజయ్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఐదేళ్లుగా పార్టీ రాష్ట్ర ఇంఛార్జిగా ఉన్న జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవ్‌ధర్‌ను బీజేపీ పక్కన పెట్టేసింది. శనివారం ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో జేపీ నడ్డా ఆయనకు చోటు ఇవ్వలేదు. మహరాష్ట్రకు చెందిన సునీల్‌ దేవ్‌ధర్‌ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఆరేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు అమిత్‌షా నియమించారు. 2018, జూలై 30న ఏపీ సహ ఇంఛార్జిగా నియమించారు. అయితే సునీల్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం మినహా క్షేత్రస్థాయిలో ఎలాంటి పని చేయలేదని పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తూనే.. తెరవెనుక దోస్తు చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు దేవ్ ధర్ను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.




Updated : 30 July 2023 12:39 PM IST
Tags:    
Next Story
Share it
Top