బెంగళూరు..సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంటి తలుపులు తెరిచి చూస్తే..
X
బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ఇంటి పెద్ద కోపం ఇంట్లోని వారి ఊపిరి ఆగేలా చేసింది.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వీరాంజేయ అనే వ్యక్తి భార్య , ఇద్దరు పిల్లలను చంపి, తాను సూసైడ్ చేసుకున్నాడు. కాడుగడి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా జులై 31న మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన 31 ఏళ్ల వీరాంజనేయ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. కుటుంబంతో సహా సీగేనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. భార్య హేమవతి, ఏడాదిన్నర, ఎనిమిది నెలల వయసున్న ఇద్దరు పిల్లలతో కలిసి ఇతని జీవితం హాయిగానే సాగుతోంది. అయితే ఏమైందో ఏమో కానీ వీరాంజనేయుడు తన భార్య, పిల్లలను హత్యచేశాడు. ఆ తరువాత అతను ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. చాలా రోజులుగా ఇంటి తలుపులు మూసుకుని ఉండటం, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్‌మెంట్ వాసులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌కు వచ్చి ఇంటి తలుపులు తెరవగానే షాక్ అయ్యారు. వీరాంజనేయ భార్య హేమవతి, ఇద్దరు పిల్లలు బెడ్ పైన విగత జీవులుగా కనిపించారు. వీరాంజనేయ డెడ్ బాడీ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. అయితే వీరంతా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందన్న కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.