బంగ్లాదేశ్ పీఠంపై మరోసారి షేక్ హసీనా.. వరుసగా నాలుగోసారి..
X
బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా పార్టీ రికార్డు సృష్టించింది. అవామీ లీగ్ పార్టీ వరుసగా నాలుగోసారి.. మొత్తంగా ఐదోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 2009 నుంచి హసీనా ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ సహా దాని మిత్రపక్షాలు దూరంగా ఉండగా.. అవామీ లీగ్ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 300 సీట్లలో 299 స్థానాలకు ఎన్నికలు జరిగ్గా.. అవామీ లీగ్ 200సీట్లను కైవసం చేసుకొని వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చింది.
ఇక గోపాల్‌గంజ్-3 నుంచి పోటీ చేసిన ప్రధాని హసీనా 2లక్షలకుపై మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ స్థానం నుంచి ఆమె 1986 నుంచి గెలుస్తూ వస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో కేవలం 40శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ప్రతిపక్షాలు పోటీలో లేకపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018లో జరిగిన ఎన్నికల్లో 80శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
ఆదివారం సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగ్గా.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా భారత్ పై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌కు భారత్ ఎంతో నమ్మకమైన స్నేహితుడని అన్నారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది భారతదేశమేనని తెలిపారు.