లాటరీలో కోటి గెలిచాడు..భయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లాడు..
X
అతడో వలసకూలి. లాటరీలో రూపంలో అతడిని అదృష్టం వరించింది. ఒక్క లాటరీతో ఏకంగా కోటీశ్వరుడు అయ్యాడు. వెంటనే భయపడి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలియని పోలీసులు ఎవరైనా అతని వెంటపడుతున్నారేమో అని భావించారు. కానీ అతను చెప్పిన విషయం విని అవాక్కైన ఘటన కేరళలో జరిగింది.
పశ్చిమ బెంగాల్కు చెందిన బిర్షు రాంబా అనే కార్మికుడు కేరళలో కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడ నిర్వహించిన ఒక లాటరీలో అతడు కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ తరువాత వెంటనే అతడిని భయం వేటాడింది. నన్ను కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఆ డబ్బుల కోసం తనను ఎవరైనా చంపేస్తారేమో అనేదే అతడి భయానికి కారణం.
రాంబా సమీపంలో ఉన్న తంపనూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తనని ఎవరైనా డబ్బుల కోసం చంపేస్తారేమోనని తనకు రక్షణ కల్పించాలని కోరాడు. అంతేకాదు లాటరీలో గెలుచుకున్న డబ్బులను ఎలా తీసుకోవాలో కూడా తనకు తెలియదని.. నిర్వాహకుల నుంచి ఆ డబ్బులను ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదంతా విన్న పోలీసులు అతడికి ధైర్యం చెప్పి.. డబ్బులు ఇప్పించ్చేలా చర్యలు చేపట్టారు. డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని సూచించారు.