అదృష్టం తలుపు తట్టింది.. చెత్తకుప్పలో రూ.పాతిక కోట్లు
X
రోడ్డుపై వెళ్లేటప్పుడు రూపాయి, రెండు రూపాయల నాణేలు కనిపిస్తేనే.. ఆహా.. అదృష్టమనుకొని జేబులో వేసుకుంటాం. అలాంటిది ఒక్కసారిగా చెత్తకుప్పలో రూ.25కోట్లు కంటపడితే.. మూడో కంటికి తెలియకుండా చప్పున తీసుకోని ఇంటికెళ్లిపోతాం. మన దరిద్రాన్ని వదిలించేందుకు అదృష్ట దేవత ఇలా కరుణించిందని తెగ సంబరపడిపోతాం. బెంగళూరుకు చెత్త ఏరుకునే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే, అతడు ఆ డబ్బును ఇంటికి తీసుకెళ్లాడు కానీ.. వాటితో ఏం చేయాలో తెలియక తన ఓనర్ కు ఇచ్చేశాడు. వినడానికి కొంచెం కష్టంగా ఉన్న ఇది నిజం. ఈ నెల 1 వ తేదిన సల్మాన్ షేక్ అనే వ్యక్తి.. బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటుండగా.. చెత్త కుప్పలో 23 కట్టల అమెరికన్ డాలర్ల నోట్లు అతడికి కనిపించాయి. ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన అతడు.. ఆ కట్టలు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. అవి డబ్బులేనని అర్థమైంది కానీ.. ఇండియన్ కరెన్సీ కాకపోవడంతో వాటిని ఏం చేయాలో తెలియలేదు. 4 రోజులు ఆలోచించి చివరకు నవంబర్ 5న ఆ మొత్తాన్ని తన యజమాని బప్పాకి అప్పగించాడు.
బప్పా కూడా ముందు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని స్థానిక సోషల్ యాక్టివిస్ట్ కలిముల్లాహ్‌కి తెలియజేశాడు. వెంటనే వీరిద్దరూ కలిసి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ దగ్గరికి చేరుకున్నారు. చెత్తకుప్పలో దొరికిన డాలర్ల నోట్ల కట్టలను చూపించాడు.. విషయాన్ని వివరించారు. వెంటనే స్పందించిన దయానంద దీనిమీద విచారణ జరపాలని హెబ్బల్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నోట్ల కట్టలను పరిశీలించిన పోలీసులు వాటి మొత్తం విలువ దాదాపుగా రూ. 25 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక పోలీసుల దర్యాప్తులో నోట్ల మీద రసాయనాలు పూసినట్లుగా గుర్తించారు. అసలు ఈ నోట్లు ఒరిజినలేనా? నకిలీ వా? అని అనుమానిస్తున్నారు. మరోవైపు బ్లాక్ డాలర్స్ స్కాంకు పాల్పడుతున్న ముఠాకి చెందిన కరెన్సీ నోట్లు కావచ్చు అని… ఏదో సమస్య వల్ల అక్కడ వదిలేసి పోయి ఉంటారని అనుకుంటున్నారు. అసలు ఈ కరెన్సీ ఒరిజినల్ వా? లేక నకిలీవా? అని తేల్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపించినట్లుగా తెలిపారు.