కేంద్రం కీలక ప్రకటన.. మార్కెట్లోకి భారత్ బ్రాండ్ రైస్
X
పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. మురికివాడల్లో నివశించే వారికి ఇల్లు కొనుగోలుకు, లేదా ఇల్లు నిర్మించుకునేందుకు కొత్త హౌసింగ్ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. బడ్జెట్‌లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం గురించి ప్రస్తావించింది. అలాగే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి భారత్ రైస్ గురించి కూడా తెలిపారు. ధరల పెరుగుదలను నియంత్రించేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. సబ్సిడీ ధాన్యాన్ని రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
కేవలం రూ.29లకే కిలో బియ్యాన్ని అమ్మేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ధరల పెరుగుదల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునే ప్రయత్నంగా కేంద్రం భారత్ బ్రాండ్ రైస్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం బియ్యం రేట్లు అధికంగానే ఉన్నాయి. కిలో సన్నబియ్యం రిటైల్ మార్కెట్లో రూ.50 నుంచి రూ.60 పలుకుతోంది. ఆ ధరల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే రూ.29కే భారత్ రైస్‌ను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం భారత్ బ్రాండ్‌లో భాగంగా కిలో శనగపప్పును రూ.60కే విక్రయిస్తోంది. అలాగే గోధుమపిండిని భారత్ ఆట్టా పేరుతో కేజీ రూ.27.50లకు అమ్ముతోంది. ఇక భారత్ బ్రాండ్ రైస్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చూస్తోంది. బియ్యం ధరల సమస్య వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇటీవలె కేంద్రం పలు చర్యలు చేపట్టింది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కూడా నిషేధం విధించడమే కాకుండా బాస్మతీ బియ్యంపై ఆంక్షలు పెట్టింది. ఈ క్రమంలోనే వచ్చేవారంలో భారత్ బ్రాండ్ రైస్ సామాన్యులకు అందుబాటులోకి రానుంది.